విబేధాలు తారా స్థాయికి.. కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీల చించివేతలు

Flexes Were Removed Of Mp Komatireddy Venkat Reddy In Kompally. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రతీ ఎన్నికకు దారుణంగా తయారవుతూ వస్తోంది

By Medi Samrat  Published on  8 Nov 2021 7:48 AM GMT
విబేధాలు తారా స్థాయికి.. కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీల చించివేతలు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రతీ ఎన్నికకు దారుణంగా తయారవుతూ వస్తోంది. రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు ఇవ్వడంతో మునుపటిలా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని భావించారు. అయితే పార్టీలో వర్గపోరు చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉంది. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరిట ఉన్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. పార్టీలో ఓ వర్గానికి చెందిన వారు..ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు, కటౌట్లను బ్లేడ్లతో కత్తిరించి వేశారు. దీంతో పార్టీలో మరోసారి వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. కొంపల్లిలోని ఫంక్షన్ హాల్ లో ఈ నెల 09, 10వ తేదీల్లో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. జన జాగరణ యాత్ర పేరిట ఓ సదస్సు కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

కార్యకర్తలు ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, కటౌట్లను ఏర్పాటు చేశారు. అందులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డివి కూడా ఉన్నాయి. సోమవారం నాడు ఫ్లెక్సీలు చించివేసి ఉండడం కలకలం రేపింది. బ్లేడ్లతో కత్తిరించి ఉండడం..కొన్ని చోట్ల పూర్తిగా చింపేసి ఉండడంతో కోమటిరెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి అనుచరుడైన మహిపాల్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి..ఎంపీగా గెలిచారు. ఆయన ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డిపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీలో ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి. కొంతకాలం నుంచి ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇలా మరో వర్గం ఆయన ఫ్లెక్సీ లను చించివేయడంతో ఆయన ఎలా రియాక్ట్ అవుతారోనని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


Next Story