మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన సునవాత్ మోతీలాల్, ఆయన కూతురు వ్యవసాయ శాస్త్రవేత్త డా. అశ్విని హైదరాబాద్ వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు పురుషోత్తమయ్యగూడెం వద్ద వరద నీటిలో కొట్టుకుపోయింది. అశ్విని మృతదేహం లభ్యం కాగా మోతీలాల్ ఆచూకీ లభించలేదు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కారులో బయల్దేరగా.. ఈ విషాదం జరిగింది.
అటు మహబూబాబాద్ జిల్లా వెంకటాపురంలో చేపల వేటకు వెళ్లిన నర్సయ్య, వరంగల్ జిల్లా గిర్నిబావి వాగులో చిక్కుకుని వజ్రమ్మ, ములుగు జిల్లా కాల్వపల్లి వాగులో మల్లికార్జున్, హన్మకొండ జిల్లా పరకాలలో విద్యుత్ షాక్‌తో యాదగిరి మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలకు ఇప్పటి వరకు 9 మంది చనిపోయినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు.