రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం : కేటీఆర్
Farmers welfare is main aim of Telangana. రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయమని, రైతు సంఘం ప్రయోజనాలను పరిరక్షించేందుకు
By Medi Samrat
రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయమని, రైతు సంఘం ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు శుక్రవారం పునరుద్ఘాటించారు. మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న పంటలను పండించేలా రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 5,000 ఎకరాల భూమికి ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసిందని కేటీఆర్ చెప్పారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో రైతు వేదికను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి క్లస్టర్‌లో రైతు వేదిక నిర్మించడంతో పాటు ప్రతి క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో)ని నియమించి అట్టడుగు స్థాయిలో ఉన్న రైతులను కలుపుకొని పంటలు పండించేలా అవగాహన కల్పించామన్నారు. ఏఈఓలు, రైతుబంధు సమితి అధ్యక్షుల సలహాతో రైతులు ఇప్పుడు డిమాండ్ ఉన్న పంటలు సాగు చేస్తున్నారు. నిర్దిష్ట విస్తీర్ణంలో సాగుకు అనుకూలమైన పంటల గురించి రైతులకు సలహాలు ఇవ్వడంలో ఏఈఓలు కీలకపాత్ర పోషిస్తున్నారు. రైతుల సౌకర్యార్థం దేశంలోనే తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా 2,603 రైతు వేదికలను నిర్మించామని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వివరిస్తూ.. 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేశామన్నారు. రైతుబంధు పథకం కింద ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాకు వస్తున్న గోదావరి నీటితో జిల్లాలో ఎండిపోయిన భూములు పచ్చని పొలాలుగా మారాయని తెలిపారు. అన్నపూర్ణ, రాజరాజేశ్వర ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలో ఉన్న మల్కపేట రిజర్వాయర్‌తో జిల్లాలో భూగర్భ జలాలు ఆరు మీటర్ల ఎత్తుకు పెరిగాయని కేటీఆర్ తెలిపారు. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్టేషన్‌లో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐఏఎస్ అధికారులు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరగడంపై అవగాహన కల్పిస్తున్నారని.. ఇది ఒక గౌరవమని కేటీఆర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని అన్నారు.