దేశంలోనే అతిపెద్ద సుగంధ కేంద్రాలలో ఒకటైన నిజామాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో పసుపు ధరలు భారీగా పడిపోయాయి. దీంతో ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున పసుపును యార్డుకు తీసుకు వస్తుండగా, ధరలు తగ్గుముఖం పట్టాయి.
జనవరిలో పసుపు సీజన్ ప్రారంభంలో, ధరలు క్వింటాల్‌కు 15,000 రూపాయలకు చేరుకున్నాయి. కానీ ఇప్పుడు 10వేల రూపాయలు కూడా పలకడం లేదు. అయితే కొంతమంది వ్యాపారులు తక్కువ ధరలకు సిండికేట్‌గా ఏర్పడ్డారు. వీరిని అరికట్టేందుకు మార్కెట్ కమిటీ గానీ, అధికారులు గానీ చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్ర విత్తన కార్పొరేషన్ చైర్మన్ సుంకెట్ అన్వేష్‌రెడ్డి రైతులను మోసం చేస్తున్న వ్యాపారులను హెచ్చరించారు. ఎవరైనా వ్యాపారులు రైతులను దోపిడీ చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.