పంట సాగు చేసే వారికే రైతు భరోసా అందనుంది. ఈ పథకం కింద అర్హులకే మాత్రమే పెట్టుబడి సాయం అందించాల్సి ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. త్వరలోనే రైతు సంఘాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు. అభిప్రాయాలపై అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం జరిగిన జడ్పీ సమావేశం జరిగింది. ఈ క్రమంలోనే రైతు భరోసా పథకంపై పలువురు సభ్యులు సందేహాలను లేవనెత్తగా.. మంత్రి తుమ్మల నివృత్తి చేశారు.
గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో పంటలు సాగు చేయని వారికి కూడా డబ్బు ఇవ్వటంతో ఈ పథకం దుర్వినియోగమైందనే భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు. అందుకే పంట సాగు చేసే వారికే పెట్టుబడి సాయం అందించాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. రైతుభరోసా పథకం అమలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న మంత్రి తుమ్మల.. పంటల బీమా పథకం సైతం అర్హులకే వర్తించేలా రూపకల్పన చేస్తామన్నారు. బీమా ప్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందేలా నిబంధనలను సులభతరం చేస్తామని పేర్కొన్నారు.
2 లక్షల రూపాయల చొప్పున పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారని తెలిపారు. రుణమాఫీ విడతల వారీగా మాఫీ చేయటం వల్ల ఆ డబ్బు వడ్డీకే సరిపోతుందన్న భావన రైతుల్లో ఉందని, ఇదే అంశంపైనా త్వరలో విధివిధానాలు రూపొందిస్తామన్నారు. త్వరలోనే వీటన్నింటిపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుందన్నారు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల పంట రుణమాఫీ అమలుకు కట్టుబడి ఉన్నామని మంత్రి తుమ్మల తెలిపారు.