వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా.. క్లారిటీ ఇచ్చిన సీఎం
రైతు పంట వేసినా, వేయకున్నా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 11 Jan 2025 9:02 AM ISTవ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా.. క్లారిటీ ఇచ్చిన సీఎం
రైతు పంట వేసినా, వేయకున్నా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతు భరోసా పథకం అమలుపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక ప్రకటన చేశారు. ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేకుండా వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరాకు రైతు భరోసా చెల్లించాలని ఆదేశించారు. వ్యవసాయానికి ఉపయోగపడని భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇవ్వకూడదని తేల్చి చెప్పారు. వ్యవసాయేతర భూములను గుర్తించి వాటిని రైతు భరోసా నుంచి మినహాయించాలని చెప్పారు. రియల్ ఎస్టేట్, లే అవుట్, నాలా కన్వర్ట్ అయిన మైనింగ్ భూములు, గోదాములు నిర్మించిన భూములు, ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలను ముందుగా సేకరించాలని సూచించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, సంబంధిత విభాగాలన రికార్డులన్నీ క్రోడీకరించుకోవాలని, విలేజ్ మ్యాప్‌లను పరిశీలించి అధికారులు ఫీల్డ్‌కు వెళ్లి వీటిని ధ్రువీకరించుకోవాలని సూచించారు. వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాలను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలని, వీటిని గ్రామ సభల్లో చర్చించి వెల్లడించాలని సూచించారు.
ఈ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడా నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో అధికారులను కూడా అప్రమత్తం చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలికల హాస్టల్స్‌లో మహిళా ఐఏఎస్ అధికారులతో పాటు ఐపీఎస్ అధికారులు కూడా నెలలో ఒక్కసారి విజిట్ చేయాలని ఆదేశించారు. అక్కడే రాత్రి బస చేయాలని సూచించారు.