తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల కేటాయింపుల కోసం దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. ఈసారి మొత్తం 95,436 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.2,863 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది గత సంవత్సరం కంటే రూ.218 కోట్లు ఎక్కువ కావడం విశేషం. దీంతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన ఆదాయ లక్ష్యం దాదాపుగా నెరవేరింది.
రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం షాపుల లైసెన్స్‌ల కేటాయింపు కోసం ఎక్సైజ్ శాఖ సెప్టెంబర్ 25న నోటిఫికేషన్ జారీ చేసింది. తదుపరి రోజు నుంచే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. క్రితం సారి 1.32 లక్షల దరఖాస్తుల ద్వారా దాదాపు రూ.2,645 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈసారి దరఖాస్తుల సంఖ్య కొంత తగ్గినప్పటికీ, రుసుము పెరగడం వల్ల ఆదాయం పెరిగింది. గతంలో దరఖాస్తు రుసుము రూ.2 లక్షలు కాగా, ఈసారి రూ.3 లక్షలకు పెంచడం వల్ల ఆదాయం దాదాపు రూ.3 వేల కోట్లకు చేరుతుందని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది. అక్టోబర్ 18 అర్ధరాత్రి వరకు 89,344 దరఖాస్తులు మాత్రమే రావడంతో.. అధికారులు గడువు పొడిగించాలని నిర్ణయించారు. ఆ గడువు గురువారం ముగిసింది.