కేసీఆర్‌ను చూసి గజగజ వణుకుతున్నారు

కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే కాంగ్రెస్ నేత‌లు పీసీసీ అధ్యక్షులు, మంత్రులు అయ్యారని మాజీమంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

By -  Medi Samrat
Published on : 23 Dec 2025 6:13 PM IST

కేసీఆర్‌ను చూసి గజగజ వణుకుతున్నారు

కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే కాంగ్రెస్ నేత‌లు పీసీసీ అధ్యక్షులు, మంత్రులు అయ్యారని మాజీమంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మాట్లాడిన అంశాలపై రివ్యూ చేసుకోండి.. కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హెచ్చ‌రించారు. పాలమూరు పచ్చబడితే.. కాంగ్రెస్ కళ్లు ఎర్రబడ్డాయన్నారు. ఎస్ఎల్‌బీసీ కుప్పకూలి మనుషులు చనిపోతే శవాలు తీయలేదు.. 7 వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రింకింగ్ వాటర్ కోసం ఎవరి అనుమతులు అవసరం లేదు.. రిజర్వాయర్లన్నీ డ్రింకింగ్ వాటర్ కోసం కట్టారా.? అని ప్ర‌శ్నించారు. పాలమూరు, రంగారెడ్డికి ఏడు అనుమతులు బీఆర్ఎస్‌ హయాంలోనే వచ్చాయని.. 45 టీఎంసీలు అంటే మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు ఏం కావాలని ప్ర‌శ్నించారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, లోక్ సభ సభ్యులు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. తెలంగాణ హక్కుల గురించి బరాబర్ మాట్లాడుతాం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చకు రావాలని స‌వాల్ విసిరారు. మీ మొహాలకు రైతులకు యూరియా ఇవ్వలేదు.. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని మండిప‌డ్డారు. తెలంగాణపై రేవంత్ రెడ్డికి సోయి లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తప్ప తెలంగాణలో ఉన్న తొమ్మిది జిల్లాలు కరువు జిల్లాలుగా ఉండేవన్నారు. కేసీఆర్‌ను చూసి గజగజ వణుకుతున్నారు.. రెండు ఏళ్లల్లో మీ పని అయిపోవడం ఖాయం అని జోస్యం చెప్పారు. పాలమూరు,రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. 45 టీఎంసీల‌కు ఒప్పుకుంటే పాలమూరును దగా చేసినట్లేన‌ని.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో కాదు.. ఢిల్లీలో పెట్టాలని సూచించారు.

Next Story