కాంగ్రెస్‌ పార్టీకి జీవన్‌ రెడ్డి రాజీనామా.. టీ కాంగ్రెస్ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు

మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. జగిత్యాలలో నిర్వహించిన తన అనుచరులు, అభిమానుల సమావేశంలో జీవన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

By -  Medi Samrat
Published on : 25 March 2026 2:54 PM IST

కాంగ్రెస్‌ పార్టీకి జీవన్‌ రెడ్డి రాజీనామా.. టీ కాంగ్రెస్ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు

మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. జగిత్యాలలో నిర్వహించిన తన అనుచరులు, అభిమానుల సమావేశంలో జీవన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తననే నమ్ముకున్న కార్యకర్తల హక్కులను కాపాడలేకపోతున్నానని అందుకే ఇన్నేళ్లు కొనసాగిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం రాజీనామా లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ రేవంత్‌ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. 'పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదు.. జగిత్యాలలో ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పినా వినలేదు. నేను, నా కార్యకర్తలు అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నాం. తీవ్రమైన బాధతో పార్టీని వీడుతున్నా' అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.

'నేను కొంతమంది లాగా ముఖ్యమంత్రి అయ్యేందుకు కాంగ్రెస్ పాలోకి రాలేదు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు.. కానీ మమ్మల్ని కూడా బతకనివ్వు' అని రేవంత్‌ రెడ్డిపై ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేశారు. 'నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎంతమందిని తొక్కుతావయ్య నువ్వు రేవంత్ రెడ్డి.. నీ తొక్కుడు కాదు రేవంత్ రెడ్డి.. ఈ జగిత్యాలలో ఏ శక్తి నన్ను ఆపలేదు.. ఎవడయ్యా ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి? ఆయ‌న‌కు, కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? బతకడానికి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. ఆయ‌న‌ ప్రభుత్వ సలహాదారుడిగా నియామకం అయిన తర్వాత ఇచ్చిన సలహాలు ఎన్ని?' అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

'వేం నరేందర్ రెడ్డి ఎవరు? ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఏంది?' అని జీవన్ రెడ్డి ప్ర‌శ్నించారు. 'రేవంత్ రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తా.. నీతో అణగదొక్కబడటం కంటే పోరాటం చేస్తే నాకు పోయేది ఏముంది?' అని వ్యాఖ్యానించారు. 'రేవంత్ రెడ్డి నిర్ణయాలతో ఆయన సొంత పార్లమెంట్ మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు. చేవెళ్ల ఎంపీ స్థానానికి తొలుత సునీతా మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించి.. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డిని తెచ్చి అతడికి టికెట్‌ ఇచ్చారు. దాని ప్రభావం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని పార్లమెంట్ స్థానం మహబూబ్ నగర్ మీద ప‌డింది. అలానే చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లల‌లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది' అని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ.. కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేయడం దేనికి సంకేతం.. అందుకే సికింద్రాబాద్ ఎంపీ సీటును కాంగ్రెస్ కోల్పోయింద‌న్నారు.

Next Story