యాసంగి ముగిసి వానాకాలం మొదలవుతున్నా ధాన్యం కొనార అని.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలుపుతున్న రైతులను ఈడ్చివేయం దారుణం..అని నిరంజన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. క్వింటాల్‌కు రూ.500 బోనస్ సంగతి దేవుడెరుగు కల్లాలకు వచ్చిన ధాన్యం నెలలు దాటినా కొనడం లేదు..అని నిరంజన్ రెడ్డి విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడే ఇంకా కల్లాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు చేయక రైతులు దీనంగా ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ కాకున్నా, రైతు భరోసా రాకున్నా కష్టాలకు ఓర్చి పండించిన ధాన్యం అమ్ముకోవడానికి వస్తే అరిగోస పెడుతున్నారు. ఇది ప్రజాపాలనా? రైతులను వేధించే పాలనా? ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఆగం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలి. క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలి. బకాయి ఉన్న రూ.500 బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలి..అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.