సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
By Medi Samrat Published on 22 Jan 2024 8:35 PM IST
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్‌ను పట్టుకుని నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఊహించి లంకె బిందెలు ఏమైనా పెట్టి వెళ్లాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బును తాము ఎత్తుకెళ్లినట్లుగా కాంగ్రెస్ నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాము కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. తప్పుడు ప్రచారాలతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని, దేశం మెచ్చేలా తెలంగాణ రాష్ట్రంలో సెక్రటేరియట్, యాదాద్రి ఆలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కట్టామని గుర్తు చేశారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం లేదని.. ఎందుకంటే తమ ప్రభుత్వ హయాంలో ఇంటింటకీ నల్లా నీరు, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు లాంటి పనులు పెండింగ్‌లో లేకుండా పూర్తి చేశామని అన్నారు. ఒక్క రూపాయి ఆశించకుండా తమ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు.