సెక్యురిటీ లేకుండా మూసీ ప్రాంతంలో తిరిగి చూపించు.. సీఎం రేవంత్‌కు మాజీమంత్రి స‌వాల్‌

రేవంత్ వ్యాఖ్యలు సీఎం స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని మాజీమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  18 Oct 2024 4:58 PM IST
సెక్యురిటీ లేకుండా మూసీ ప్రాంతంలో తిరిగి చూపించు.. సీఎం రేవంత్‌కు మాజీమంత్రి స‌వాల్‌

రేవంత్ వ్యాఖ్యలు సీఎం స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని మాజీమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మూసీ సుందరీకరణ పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు, రాష్ట్ర అప్పులు, గ్రూప్-1 అంశంపై ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల పరువు పోయేలా రేవంత్ ఉపన్యాసాలు ఉన్నాయన్నారు. రేవంత్ వ్యక్తిగా పరువు పోగొట్టుకుంటే ఫర్వాలేదు.. తెలంగాణ సీఎంగా పరువు పోతే ఎవరికి నష్టం అని ప్ర‌శ్నించారు. ఎవరో రాసిచ్చిన పాఠం చదవడం రేవంత్ మానేస్తే మంచిది.. సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు.

తెలంగాణా ఆదాయం పెంచింది కేసీఆర్ అని అన్నారు. 2014 బడ్జెట్.. ఇప్పటి బడ్జెట్ చూస్తే ఎవరు ఆదాయం పెంచారో తెలుస్తుందన్నారు. అప్పులు మంత్రుల జేబులో నుండి కడుతున్నట్లు అతితెలివిగా మాట్లాడుతున్నారన్నారు. మేము కూడబెట్టిన ఆదాయం నిలబడితే చాలు అన్నారు. 420 హామీలోద్దు, కనీసం కేసీఆర్ ఇచ్చిన పథకాలైనా ఇస్తే చాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ఆదాయం, అప్పుల పై చర్చకు సిద్ధమేన‌న్నారు.

సెక్యురిటీ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రాంతంలో తిరిగి చూపించాలని స‌వాల్ విసిరారు. మూసీ కూల్చివేతల తరువాత సెక్యూరిటీ పెంచుకుని ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు.

ఆశోక్ నగర్ నిరుద్యోగుల వల్లే రేవంత్ కి అధికారం వ‌చ్చింద‌న్నారు. ఇప్పుడు అశోక్ నగర్ పేరు వింటే రేవంత్ కి భయమేస్తోందన్నారు. అశోక్ నగర్ లో పోలీస్ నిర్బంధం దేనికి అని ప్ర‌శ్నించారు. యువత ఆవేశం ఇలానే కొనసాగితే తెలంగాణ మొత్తం అశోక్ నగర్లే అవుతాయన్నారు. నిర్బంధం పెట్టె బదులు అనుమానాలు నివృత్తి చేయండన్నారు. కాంగ్రెస్ సీనియర్లే సీఎం ఏకపక్షంగా వెళ్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ప్రజల నుండి దూరమౌతున్న రేవంత్.. దూకుడు మానకపోతే పార్టీకి దూరమౌతావ్ అని హెచ్చ‌రించారు.

Next Story