రేవంత్ రెడ్డికి సీఎం పదవి.. కేసీఆర్ పెట్టిన భిక్ష : హరీష్ రావు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు భద్రాచలం నియోజకవర్గస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
By Medi Samrat Published on 3 Feb 2024 3:44 PM ISTమాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు భద్రాచలం నియోజకవర్గస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం ఎమ్మెల్యేను గెలిపించినందుకు ప్రజలు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉగాది పచ్చడి లాగే మన గెలుపు ఓటములు ఉన్నాయన్నారు. ఓటమి ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే. తప్పకుండా పికప్ తీసుకుంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసీఆర్ నాడు పెద్ద సభ పెడితే 35 రోజులు ఇక్కడే ఉన్నా. అందరితో కలిసి పని చేశాం. సభను విజయవంతం చేశామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రస్థానంలో పూల బాటలు ఉన్నాయి, ముల్ల బాటలు ఉన్నాయి. ఓటమి, గెలుపు ఉన్నాయన్నారు.
2009 లో 10 స్థానాలు మాత్రమే గెలిచాం. అధైర్యపడి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. రేవంత్ రెడ్డి పిసిసి అయ్యేవాడు కాదు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదన్నారు. రేవంత్ రెడ్డికి సీఎం పదవి.. కేసీఆర్ పెట్టిన భిక్ష. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది, ఆయనకు నేడు సీఎం పదవి వచ్చిందన్నారు. గోబెల్స్ ప్రచారం చేసి గెలుపు సాధించారు. అనేక అబద్ధాలు ప్రచారం చేశారు. ప్రగతి భవన్ లో బంగారు బాత్ రూములు, వంద రూములు ఉన్నాయన్నారు. ఉన్నాయా అని భట్టిని అడిగితే సమాధానం చెప్పలేదన్నారు. మేము దూరం పెడితే, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆధానీతో అలైబలై చేసుకున్నది రేవంత్ రెడ్డి కాదా.. అని ప్రశ్నించారు.
ఎవరు ఎవరితో చీకటి ఒప్పందం చేసుకున్నట్టు.. ఎవరు ఎవరితో కుమ్మక్కు అయినట్టు అని ప్రశ్నించారు. బీజేపీతో ఒప్పందమ్ పెట్టుకున్నది మీరు. మేము బండి సంజయ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావులను ఒడించామని పేర్కొన్నారు. దొంగే దొంగ దొంగ అన్నట్టు కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందన్నారు. ఆదానీతో దోస్తాన్ మీది అన్నారు. అదిలాబాద్ లో నిన్న సీఎం మరోసారి అబద్ధాలు చెప్పారన్నారు. రాష్ట్ర అప్పు 3.87 లక్షల కోట్లు అయితే, 7 లక్షల కోట్లు అని ప్రచారం చేస్తున్నారు. రెండు నెలలు కాలేదు 14 వేల కోట్ల అప్పు చేశారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటని ప్రశ్నించారు.
అదిలాబాద్ జిల్లాలో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది బీఆర్ఎస్.. తండాలను పంచాయతీలుగా మార్చింది బీఆర్ఎస్.. ఎన్నో ఏళ్ల కల మంచిర్యాలను జిల్లాగా చేసింది బీఆర్ఎస్.. మారు మూల ప్రాంతాలకు తాగు నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్.. నీ కళ్ళకు పస్కలు వస్తె కనబడవు. ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు.
ఒక సీఎం అసభ్యంగా, అసహ్యంగా, అనాగరికంగా మాట్లాడుతున్నారు. దేశంలోనే అనాగరిక, సంస్కార రహిత, అనాగరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ నీతి మాటలు మాట్లాడటం తర్వాత.. మీ సీఎం రేవంత్ రెడ్డికి నీతి చెప్పు అని సూచన చేశారు. ఈ రాష్ట్ర పరువు, మీ కాంగ్రెస్ పరువు తీసే విధంగా మాట్లాడుతున్నాడు. మార్పు తెస్తా అని ప్రభుత్వం.. అభాగ్యులు, అన్నార్ధులు, పేదలకు నెల నెలా పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. గెలిస్తే 4000 అన్నారు. పింఛన్లు మాత్రం పెరగలేదు. పాతవి ఇవ్వలేదన్నారు. ఈ జిల్లా మంత్రి ఆర్థిక మంత్రి. వాళ్లకు పింఛన్లు ఇవ్వక పోవడమే మీ ప్రాధాన్యమా అని ప్రశ్నించారు.
పింఛన్లు ఇవ్వకపోవడమే మార్పా..? కరెంటు కోతలు పెట్టడమే మార్పా? 6 లక్షల మంది ఆటో సోదరులను రోడ్డున పడేయడమే మార్పా? రైతు బంధు ఫిబ్రవరి దాకా పడక పోవడం మార్పా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కృష్ణా నది ప్రాంత ప్రాజెక్టులను కేంద్రానికి మేము అప్పగించలేదన్నారు. మీరు మాత్రం అప్పగించారు. మీరు చేసిన పనుల వల్ల నీటి సమస్యలు వస్తాయని అన్నారు. తిట్ల పురాణం తప్ప మీరు చేసింది ఏముందని మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల నోటిిఫికేషన్ లోపు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నా. లేదా ప్రజలు మీకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మేము ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాం. ఫ్రస్టేషన్ లో సీఎం ఉన్నారు. రెచ్చగొట్టినా మేం రెచ్చిపోమన్నారు. 420 హామీలు అమలు అయ్యేదాకా, మా పోరాటం ఆగదన్నారు.
ప్రజల్లో మార్పు స్టార్ట్ అయ్యింది. నీళ్ళు, పాలు ఏంటో అర్థమైందన్నారు. భద్రాచలం కరకట్ట కోసం 39 కోట్లు ఇచ్చాం. మీరు పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎంపి ఎన్నికల్లో విజయం సాధించాలి. మూడో సారి కూడా మహబూబాబాద్ ఎంపి గెలవాలి. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే హామీలు అమలు అవుతాయి అన్నారు. 40 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అని మమతా బెనర్జీ అన్నారు. నితీష్, మమత, కేజ్రీవాల్ దూరం అయ్యారు. ఇండియా కూటమి కుప్పకూలిందన్నారు. రాహుల్ ప్రధాని అవడం కలే. కేంద్రంలో అధికారంలోకి రావడం కల్ల అని ఎద్దేవా చేశారు.
బీజేపీని నిలువరించే శక్తి ప్రాంతీయ పార్టీలకు ఉన్నది. మమతా, కేసీఆర్, కేజ్రీవాల్ కు పోరాడే శక్తి ఉందన్నారు. బీజేపీతో మీరు కుమ్మక్కయ్యారు. గల్లీలో, ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా, తెలంగాణ కోసం పోరాటం చేసేది బీఆర్ఎస్ ఎంపీలేనన్నారు. నాడు 7 మండలాలను ఆంధ్రాలో కలిపింది బీజేపీ, కాంగ్రెస్. నిరసించింది బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. భద్రాచలం కోసం వచ్చే భక్తుల పార్కింగ్ కు జాగ లేదు. భద్రాచలం చుట్టూ జాగను ఆంధ్రాకు అప్పగించారు. లోయర్ సీలేరు అప్పగించారు. భద్రాచలం రెండు వార్డులు ఆంధ్రలో ఉన్నాయన్నారు.