బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్‌కు..కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎకనమిక్ సర్వే 2024-25 నివేదిక చెంపపెట్టు లాంటి సమాధానం అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 15 పెద్ద రాష్ట్రాలతో పోల్చితే 88 శాతం సొంత పన్నుల రాబడుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచి, రాష్ట్ర ఆర్థిక పరిపుష్టిని చాటిందని అన్నారు. మిషన్ భగీరథపై చేస్తోన్న కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ వంద శాతం గ్రామీణ త్రాగునీరు సరఫరా కలిగిన రాష్ట్రంగా తెలంగాతణ ఘనత సాధించిందని హరీష్ రావు పేర్కొన్నారు.
ఐటీలో తెలంగాణ మేటి అని ఎకనమిక్ సర్వే మరోసారి తేల్చిచెప్పిందని అన్నారు. కర్ణాటకతో పాటు తెలంగాణ కూడా అద్భుత ప్రగతి సాధించిందని చెప్పారు. కాళేశ్వర సహా, తెలంగాణ నీటి పారుదల వ్యవస్థపై కాంగ్రెస్ గోబెల్ ప్రచారం శుద్ధ తప్పు అని నివేదిక తేల్చి చెప్పిందని వ్యాఖ్యానించారు. అత్యధిక ఇరిగేటెడ్ ఏరియాతో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచి, దేశానికి ఆదర్శానికి నిలిచిందని తేటతెల్లం చేసిందని హరీష్ రావు చెప్పారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో వి-హబ్ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని ఎకనమిక్ సర్వే పేర్కొన్నట్లు హరీష్ రావు చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక, ఐటీ, నీటి పారుదల, మహిళా సాధికారతలో సాధించిన ఘనతను ఆర్థిక సర్వే లెక్కలతో సహా వివరించిందని హరీష్ రావు తెలిపారు.