బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
Ex Andhra Chief Minister Joins BJP. అవిభక్త ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, మాజీ కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు.
By Medi Samrat
Ex Andhra Chief Minister Joins BJP
అవిభక్త ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, మాజీ కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ నిన్న బీజేపీ గూటికి చేరగా.. కిరణ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీ కండువా కప్పుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కి చివరి ముఖ్యమంత్రి. పార్టీ నాయకత్వంతో విభేదాల కారణంగా మార్చి 2023లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ అధిస్టానం పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. దీంతో రాష్ట్రంలో తమ ఉనికి చాటాలని భావిస్తున్న బీజేపీకి పెద్దగా జనాకర్షణ ఉన్న నేతలు లేరు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిందని రాజకీయ వర్గాల టాక్.
62 ఏళ్ల కిరణ్ కుమార్ రెడ్డి 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 'జై సమైక్యాంధ్ర' అనే పార్టీని స్థాపించారు. అయితే.. 2014 ఎన్నికల్లో ఆయన ప్రభావం చూపలేకపోయారు. ఆ తర్వాత 2018లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కానీ చాలా కాలం పాటు రాజకీయాల్లో నిష్క్రియంగా ఉన్నారు. రాయలసీమ ప్రాంతంలో పార్టీ ఉనికిని బలోపేతం చేయాలని భావిస్తున్న అధిస్టానం కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.