ఆదిలాబాద్ కోర్టు సంచ‌ల‌న తీర్పు : హత్య కేసులో మాజీ ఎంఐఎం నేత‌కు జీవిత ఖైదు

Ex-AIMIM leader sentenced to life in prison in murder case. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం రాజకీయ ప్రత్యర్థిని

By Medi Samrat  Published on  24 Jan 2022 6:06 PM IST
ఆదిలాబాద్ కోర్టు సంచ‌ల‌న తీర్పు : హత్య కేసులో మాజీ ఎంఐఎం నేత‌కు జీవిత ఖైదు

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం రాజకీయ ప్రత్యర్థిని హత్య చేసిన కేసులో ఎంఐఎం మాజీ నాయకుడికి జీవిత ఖైదు విధించింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ మాజీ డిప్యూటీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ అహ్మద్ 2020 డిసెంబర్ 18న ఆదిలాబాద్ పట్టణంలో కాల్పులు జరిపాడు. ఈ ఘ‌ట‌న‌లో మాజీ కార్పొరేటర్ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అయితే.. ఫరూక్‌ మూడు కేసుల్లో దోషిగా తేలగా, మరో రెండు కేసుల్లో నిర్దోషిగా విడుదలయ్యాడు. హత్య కేసులో ప్రధాన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. హత్యాయత్నం కేసులో ఫరూక్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, ఆయుధ చట్టం కింద మూడేళ్ల జైలు శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. అన్ని శిక్ష‌లు ఏకకాలంలో అమలు చేయబడతాయని తెలుస్తోంది. ఫరూఖ్‌కు మూడు కేసుల్లో ఒక్కో కేసుకు రూ.12,000 జరిమానా కూడా విధించారు. తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేయడానికి కోర్టు అతనికి వీలు కల్పించింది.

ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడ ప్రాంతంలో తన రాజకీయ ప్రత్యర్థి సయ్యద్ జమీర్, అతని సోదరుడు సయ్యద్ మన్నన్, మేనల్లుడు సయ్యద్ మొహతేసిన్‌లపై తన లైసెన్స్ రివాల్వర్‌తో ఫరూక్ కాల్పులు జరిపాడు. అంతేకాకుండా నిందితుడు వారిపై కత్తితో దాడి చేశాడు. రెండు గ్రూపుల క్రికెట్ ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవలో.. ఫరూక్ తన ప్రత్యర్థులపై దాడి చేశాడు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యింది. వీడియోలో ఫరూక్‌ ఒక‌ చేతిలో కత్తి పట్టుకుని.. మ‌రో చేతిలో రివాల్వ‌ర్ ప‌ట్టుకుని కాల్పులు జరుపుతున్నట్టు కనిపించాడు. ఈ ఘటన తర్వాత ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నుంచి ఫరూక్‌ను సస్పెండ్ చేశారు.


Next Story