ప్రతిపక్షం నిలదీస్తే గానీ.. పేదల గురించి ఆలోచించరా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పిన ప్రభుత్వ ప్రకటన బీఆర్ఎస్ విజయమే అని అన్నారు. మీ సేవా దరఖాస్తులకు కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా హరీష్‌రావు స్పష్టం చేశారు. దరఖాస్తులు చేసుకోవడం నిరంత ప్రక్రియ అని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన, పెరిగిన ద్రవ్యోల్బణం ఆధారంగా రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తున్నట్లు రాసుకొచ్చారు. ప్రజలను మోసం చేయాలని చూసిన ప్రతిసారి, తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటామని, నిలదీస్తూనే ఉంటామని అన్నారు. పేదలకు రేషన్ కార్డులు అందకుండా చేస్తున్నారని, కోతలు విధిస్తున్నారని సీఎంకు బహిరంగ లేఖ రాయడంతో పాటు, మీడియా సమావేశం నిర్వహించి నిలదీస్తే గానీ ఈ ప్రభుత్వానికి జ్ఙానోదయం కలగలేదా అని ఎక్స్ వేదికగా హరీష్‌రావు ప్రశ్నించారు.