మంగళవారం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో చర్చించకుండానే శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలను మూడు రోజుల పాటు పరిమితం చేయడంపై అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తప్పుబట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వర్షాకాల సమావేశాలను 3 రోజులకు కుదించారని అన్నారు. అంతకుముందు గన్‌పార్క్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్మారకానికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి ఈటల నివాళులర్పించారు.
బీజేపీ నేత ఈటల మాట్లాడుతూ.. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ నామమాత్రం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోందన్నారు. కేసీఆర్ అహంకారానికి ఇదే నిదర్శనమన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవమానిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. 6, 12, 13 తేదీల్లో మాత్రమే సమావేశాలు జరుగుతాయని కేసీఆర్ నోటీసులు పంపారని.. శాసన సభ్యులను గడ్డిపోచ్చల్లగా అవమానిస్తున్నారని ఈటల ఫైర్ అయ్యారు. తెలంగాణ గడ్డపై ఎవరూ సంతోషంగా లేరని ఈటల విమర్శించారు.
''గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడాన్ని ప్రశ్నించినందుకు ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు'' అని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యల గురించి ప్రశ్నించేందుకు వస్తే ఇలా చేశారని రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదని ఆయన అన్నారు. వీఆర్ఏలు, గ్రామ కార్యదర్శులు, గెస్ట్ లెక్చరర్ల ఆత్మహత్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పోడు భూములు,దళిత బంధు ప్రజా సమస్యలపై ప్రభుత్వ మెడలు వంచుతామన్నారు.