బీజేపీ నేత ఈటల రాజేందర్, తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గోల్కోండ రిసార్ట్‌లో రహహ్యంగా కలిశారని మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. వారు కలిసిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. రేవంత్‌రెడ్డిని కలిసింది వాస్తవమేనని చెప్పారు. కానీ రేవంత్‌రెడ్డిని ఇప్పుడు కలవలేదని తెలిపారు. రాజీనామా చేసిన తర్వాత కలిసినట్లు ఈటల వెల్లండిచారు. రేవంత్‌రెడ్డిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాజీనామా చేశాక అన్ని పార్టీల నేతలను కలిశానని.. తెలంగాణలో ఉద్యమంలోనూ అన్ని పార్టీల మద్దతు కోరలేదా అని అన్నారు. అభివృద్ధి కోసం చాలా మందిని కలుస్తామని ఈటల స్పష్టం చేశారు.
అంతకుముందు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని రహస్యంగా కలిశాడని.. వారిద్దరూ గోల్కొండ హోటల్‌లో కలిసినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. హైటెక్స్‌లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల పోటి చేస్తున్నారని విమర్శించారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ పోటీలో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ను నిలువరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.