మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ శామీర్‌పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. తన వివరణ తీసుకోకుండానే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారన్న ఈటెల.. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
హుజురాబాద్‌లో ఏ ఎన్నిక జరిగినా పార్టీని గెలిపించుకున్నామని.. ప్రాణం ఉండగానే నన్ను బొందపెట్టాలని ఆదేశాలిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హుజూరాబాద్ ప్రజలు చెప్పారని.. పదవుల కోసం నేను ఏనాడూ పాకులాడలేదని అన్నారు. గత ఐదేళ్లనుండి కేసీఆర్‌తో సఖ్యత లేదని.. నాలాగే హరీష్ రావు ను కూడా ఎన్నోసార్లు అవమానించారని అన్నారు.
కవిత ఎన్నికల్లో ఓడిపోయిందని.. తాను ఎప్పుడు ఓడిపోలేదని.. సొంత కుటుంబం కోసం మాలాంటి వాళ్ళను అణచివేస్తున్నారని అది ప్రగతి భవన్ కాదని.. అది బానిస భవన్ అని కేసీఆర్‌పై మండిపడ్డారు. బెంజ్ కార్లలో తిరిగేటోళ్లకు రైతుబంధు ఇస్తున్నారని.. ఐకెపి సెంటర్ల ఎత్తివేత విషయంలోనూ కెసిఆర్ తో బాజాప్త విభేదించానని.. మాట వినని అందర్నీ తొక్కేశారని అన్నారు. ఏ దిక్కు లేని సమయంలో కెసిఆర్ కు అండగా నిలబడ్డాం అని.. అలె నరేంద్ర, విజయశాంతిని నాలానే పంపించారని ఈటెల అన్నారు.