నేడు మీడియా ముందుకు ఈటెల.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం..!

Etela Rajendar News. మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామాకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.

By Medi Samrat  Published on  4 Jun 2021 9:27 AM IST
నేడు మీడియా ముందుకు ఈటెల.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం..!

మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామాకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈటల బీజేపీలో చేరబోతున్నారనే సంకేతాలు ఇప్పటికే వచ్చాయి. దీంతో ఈటల రాజేందర్ శుక్రవారం నాడు త‌న శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. ఆపై జూన్ 8 లేదా 9వ తేదీల్లో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.

ఈటల రాజేందర్ ఇప్ప‌టికే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌ను, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి చర్చించారు. ఏనుగు రవీందర్‌రెడ్డి, తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో కలిసి బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో బుధవారం సాయంత్రం ఈటల భేటీ అయ్యారు. ముందు ఎమ్మెల్యే పదవికి, ఆ తర్వాత టీఆర్ఎస్‌కు ఈటల రాజీనామా చేస్తారని, ఆ తర్వాత మంచి రోజు చూసుకుని బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది.

ఇదిలావుంటే.. గురువారం ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని ఈటల రాజేందర్ హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. ఈటలకు ఆయ‌న అనుచ‌రులు, మ‌ద్ద‌తుదారులు ఘనస్వాగతం పలికారు. ఈట‌ల రాజేంద‌ర్ వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా ఉన్నారు. నేడు హుజురాబాద్‌లో అనుచ‌రుల‌తో భేటీ అవుతారు. అనంత‌రం మీడియా స‌మావేశం నిర్వ‌హించి భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నారు.




Next Story