తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు భారీగా అవకాశాలు కనిపిస్తున్నాయి. డిస్కంలు సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల అంశాలను గమనిస్తే.. కరెంట్ ఛార్జీలు నిజంగానే పెరగనున్నట్లు తెలుస్తోంది. 2021 - 22, 2022 - 23 సంవత్సరాలకు సంబంధించిన వార్షిక ఆదాయ ప్రతిపాదనలను విద్యుత్ డిస్కంలు విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. ఈ సందర్భంగా రూ.21,550 కోట్ల రెవెన్యూ లోటును కలిగి ఉన్నట్లు తెలిసింది. దీనిని సర్దుబాటు చేయాలంటే కరెంట్ ఛార్జీలు పెంచక తప్పదని విద్యుత్ డిస్కంలు తమ ప్రతిపాదనల్లో తెలిపాయి. 2021-22 సంవత్సరానికి రూ.45,618 కోట్ల లోటు, 2022-23 సంవత్సరానికి రూ.53,053 కోట్ల లోటు ఉందని తెలిపాయి. అయితే వచ్చే ఆదాయం, ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ పోయినా ఇంకా లోటులోనే ఉంటున్నామని విద్యుత్ డిస్కంలు పేర్కొన్నాయి.
కాగా త్వరలోనే టారీఫ్ ఛార్జీలను ఈఆర్‌సీ పెంచనున్నట్లు తెలిసింది. పబ్లిక్ హియరింగ్ తర్వాత కరెంట్ ఛార్జీలను పెంచేందుకు అనుమతులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యుత్ డిస్కంలు నష్టాలను చవిచూస్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. కరెంట్ ఛార్జీల పెంపుకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. అయితే గత 5 సంవత్సరాల నుండి విద్యుత్ ఛార్జీలను పెంచలేదు. దీంతో ఒకేసారి ఆ భారాన్ని ప్రజలపై మోపాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. ఎవరెవరికి ఎంతేంత భారం వేయాలన్న దానిపై ప్రస్తుతం డిస్కంలు తర్జనభర్జన పడుతున్నాయి. అందుకే వార్షిక ఆదాయ అవసరాల రిపోర్టులో కరెంట్ ఛార్జీలపై స్పష్టమైన విషయం తెలుపలేదని తెలుస్తోంది. అయితే వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుండి కరెంట్ ఛార్జీలను పెంచనున్నట్లు తెలిసింది. ఇళ్లులు, కమర్షియల్, ఇండస్ట్రియల్‌తో పాటు అన్ని కేటగిరీల్లో కరెంట్ ఛార్జీలు పెరగనున్నాయి.