Telangana: గొర్రెల స్కామ్ కేసు..హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ సోదాలు చేపట్టింది
By Knakam Karthik
Telangana: గొర్రెల స్కామ్ కేసు..హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ సోదాలు చేపట్టింది. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎనిమిది చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేపట్టింది. పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, ప్రధాన నిందితుడు మొయినుద్దీన్, పలువురి ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. మొదట ఈ స్కామ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. గొర్రెల పంపిణీతో రూ.700 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది.
2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేల మంది లబ్ధిదారులకు సుమారు రూ.4వేల కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకంలో మొదటి నుంచి అధికారులు, దళారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది.
పెద్దఎత్తున డబ్బులు చేతులు మారడం, ఇతర రాష్ట్రాలకూ లింకు ఉండడంతో ఈడి రంగంలోకి దిగి హైదరాబాద్ నగరంలో మొత్తం ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాలతో పాటు మరికొన్ని చోట్ల సోదాలు కొనసాగించారు. మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ ఇంటి తో పాటు మొయినుద్దీన్, ఈక్రముద్దీన్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించారు. అయితే ఇప్పటికే ఈ స్కామ్‌లో ప్రమేయమున్న 10 మందిని ఏసీబీ అరెస్టు చేసింది.