డ్రగ్స్‌ను గేట్ వే ఆఫ్ హైదరాబాద్‌గా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
గోదావరి కృష్ణా నది జిల్లాల్లో ఎవరు ఎన్ని అవాకులు, చెవాకులు పేలినా పట్టించుకోము..అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
By - Knakam Karthik |
హైదరాబాద్: గోదావరి కృష్ణా నది జిల్లాల్లో ఎవరు ఎన్ని అవాకులు, చెవాకులు పేలినా పట్టించుకోము..అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సీఎం మాట్లాడుతూ..అడ్డంకులకు నిటారుగా నిలబడి తెలంగాణకు కావాల్సిన వాటా సాధించి ఎస్.ఎల్.బి.సిని పూర్తి చేసి నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ను తరిమికొట్టి 3.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. గుజరాత్ లో నర్మదా నది,యూపీలో యమునా నదిని శుద్ది చేశారు. హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు అడ్డంకులు కలిగిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి బ్రతుకుదెరువు కోసం వచ్చిన వారు మూసీ పక్కన నివసిస్తున్నారు. మూసీకి వరద వచ్చినప్పుడు కొట్టుకుపోతున్నారు. వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు మూసీ పునరుజ్జీవనం చేస్తున్నాం. ఉద్యోగ,ఆర్ధిక అవకాశాలు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచడమే మూసీ పునరుజ్జీవం లక్ష్యం. మత సామరస్యానికి దిక్సూచిగా మూసీ వెంట అనేక కట్టడాలు కట్టారు. మూసీ పునరుజ్జీవం చేసి తెలంగాణ వైతాళికుల విగ్రహాలు పెడతాం..అని సీఎం అన్నారు.
తెలంగాణ ప్రాంతాన్ని నేడు మత్తు మహమ్మారి,గంజాయి పట్టిపీడుస్తోంది. మధ్య తరగతి యువత సైతం పెడధోరణి పడుతున్నారు. డ్రగ్స్ నివారణకు ప్రజల మద్దతు కావాలి. కొంతమందికి ప్రభుత్వం చేసే ప్రయత్నం నచ్చకపోవచ్చు. కొంతమంది డ్రగ్స్ ను గేట్ వే ఆఫ్ హైదరాబాద్ గా మార్చారు. గంజాయి,డ్రగ్స్ నివారణకు ఈగల్ ను తీసుకువచ్చాము. డ్రగ్స్,గంజాయి వెనుక ఎంత పెద్ద వారు వున్నా ప్రభుత్వం వదిలిపెట్టదు. రాజకీయాల్లో ఉన్న వారికి ఫామ్ హౌస్ లు ఉండవచ్చు . వాళ్ళు డ్రగ్స్ ను ప్రోత్సహిస్తే ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టము. 2047 రాబోయే వందేళ్ల తెలంగాణ అభివృద్ధి ప్రణాళికను నిర్దేశిస్తుంది..అని సీఎం వ్యాఖ్యానించారు.
తప్పులుంటే దిద్దుకుంటున్నాం..
కష్టమైనా, నష్టమైనా ప్రజలతో పంచుకుంటున్నాం. ప్రజల ఆకాంక్షలు, వారి ఆలోచననే ప్రమాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. తీసుకున్న నిర్ణయాలలో మంచి చెడులను విశ్లేషించే అవకాశం ఇస్తున్నాం. తప్పులుంటే దిద్దుకుంటున్నాం. మంచి చేయడమే బాధ్యతగా భావిస్తున్నాం. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలన్న తపనతో పని చేస్తున్నాం. ప్రతి పేదవాడి మొఖంలో ఆనందమే లక్ష్యంగా సంక్షేమ చరిత్రను తిరగ రాస్తున్నాం. ఏడు దశాబ్ధాలుగా తెలంగాణ ఆశిస్తోన్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వమే మా ప్రభుత్వ ప్రథామిక ఎజెండా. అభివృద్ధిలోనే కాదు... స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం విషయంలో కూడా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా ఉంటుంది..అని సీఎం అన్నారు.