దేశంలోనే తొలిసారి పోలియో బాధితుడికి కామినేని ఆస్పత్రిలో గుండెమార్పిడి
భారతదేశలోనే తొలిసారిగా ఒక పోలియో బాధితుడికి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 May 2024 8:45 PM ISTభారతదేశలోనే తొలిసారిగా ఒక పోలియో బాధితుడికి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన 45 ఏళ్ల భాస్కర్ వృత్తిరీత్యా టైలర్. అతడు తీవ్రమైన గుండెవ్యాధితో బాధపడుతున్నాడు. గత మూడేళ్లుగా అతడి పాక్షిక పోలియో కారణంగా పరిస్థితి మరింత విషమించింది. దాంతో ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి రాగా.. ఇక్కడి గుండెమార్పిడి విభాగాధిపతి, కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ విశాల్ వి. ఖంటే, కన్సల్టెంట్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్, కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ రాజేశ్ దేశ్‌ముఖ్ తదితరులతో కూడిన బృందం ఈ అసాధారణ శస్త్రచికిత్సను విజయవంతం చేసింది. ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాల సామర్థ్యాన్ని ఇది నిరూపించింది.
భాస్కర్ గుండె సమస్య వల్ల గుండె సరిగా కొట్టుకోకపోవడం, రక్తసరఫరా తగినంతగా లేకపోవడంతో పలురకాల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో అతడికి తప్పనిసరిగా గుండెమార్పిడి చేయాల్సి వచ్చింది. ఇందుకు దాదాపు ఐదు గంటలకు పైగా సమయం పట్టింది. బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి గుండెను దానం చేసేందుకు ఆయన కుటుంబసభ్యులు ముందుకు రాగా, భాస్కర్ పాత గుండెను తీయడం, కొత్తదాన్ని అమర్చడం, దానికి రక్తనాళాలు, ఇతర నరాలను అత్యంత కచ్చితత్వంతో అనుసంధానించడం ఇదంతా చాలా సంక్లిష్టమైన ప్రక్రియ.
ఈ అసాధారణ విజయం గురించి డాక్టర్ విశాల్ వి. ఖంటే మాట్లాడుతూ, “శస్త్రచికిత్స విజయవంతం కావడంతో భాస్కర్ వేగంగా కోలుకుంటున్నాడు. అతడి రోజువారీ కార్యకలాపాలు క్రమంగా చేసుకోగలుగుతున్నాడు. గతంలో తీవ్రమైన అలసట కారణంగా మంచానికే పరిమితమైన అతడు ఇప్పుడు తగిన దూరాలు నడవగలుగుతున్నాడు. సాధారణ జీవితంలోకి తిరిగి అడుగు పెడతాడు. అయితే, శస్త్రచికిత్స అనంతరం భాస్కర్‌ను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది, కొత్త గుండెను శరీరం తిరస్కరించకుండా ఉండేందుకు మందులు వాడుతుండాలి. అతడి పరిస్థితిని మా బృందం నిరంతరం పరిశీలిస్తోంది” అని చెప్పారు.
ఈ సందర్భంగా కామినేని ఆస్పత్రుల సీఓఓ డాక్టర్ గాయత్రీ కామినేని మాట్లాడుతూ, “ఇప్పటివరకు కిడ్నీ, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలకు పెట్టింది పేరైన కామినేని ఆస్పత్రిలో ఇప్పుడు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు కూడా చేయడం ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. ఈ శస్త్రచికిత్స విజయం మా ఆస్పత్రి వైద్య సామర్థ్యాలను సగర్వంగా ప్రదర్శిస్తుంది. ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్న కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్లు డాక్టర్ విశాల్ ఖాంటే, డాక్టర్ రాజేశ్ దేశ్‌ముక్, చీఫ్ కార్డియాక్ ఎనస్థెటిస్ట్ డాక్టర్ సురేష్‌కుమార్ ఎసంపల్లి, కన్సల్టెంట్ ఎనస్థెటిస్ట్ డాక్టర్ రవళి సాడే, సుశిక్షితులైన ఐసీయూ సిబ్బంది, నర్సింగ్ బృందం అందరూ ఇందులో చాలా కీలక పాత్రలు పోషించారు” అని తెలిపారు.
కామినేని ఆస్పత్రిలో అత్యంత నిపుణులైన వైద్యులు తనకు ఒక సరికొత్త జీవితాన్ని అందించారని భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. వాళ్ల నైపుణ్యం, నిబద్ధత లేకపోతే తాను ఈ కష్టం నుంచి కోలుకునేవాడిని కానన్నారు. వైద్యులు సూచించిన మందులు కచ్చితంగా వాడుతూ, ఎప్పటికప్పుడు వచ్చి చూపించుకుంటానని చెప్పారు.