తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలో అయినా వంద శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రైతు ధర్నా సభలో పాల్గొన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడు అంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎవరైనా ఆడబిడ్డలు, రైతులు చీటింగ్ కేసు పెట్టాలంటే రేవంత్, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుల మీదే కేసు పెట్టాలని ఘాటుగా మాట్లాడారు. తెలంగాణ మొత్తం ఉద్ధరించిన, ఇక ఢిల్లీలో ఉద్ధరిస్తా, నా మాట నమ్మి ఢిల్లీలో కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని రేవంత్ చెప్పడం పెద్ద జోక్ అన్నారు కేటీర్. గూట్లో రాయి తీయనోడు, ఏట్లో రాయి తీస్తాడా అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణను ఉద్ధరించనోడు ఢిల్లీలో ఏం ఉద్ధరిస్తాడని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇన్ని అబద్ధాలు చెప్పొచ్చా అంటూ కేటీఆర్ మాట్లాడారు. రైతులకు వంద శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలో సీఎం రేవంత్ ఎదుటే చెప్పినట్లు కేటీఆర్ అన్నారు. తన ఛాలెంజ్‌కు సీఎం రేవంత్ నుంచి సమాధానమే రాలేదని సెటైర్ వేశారు.