కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్
కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik
కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్
కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్ట్కర్, కలెక్టర్, ఎస్పీతో పాటు అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులు జిల్లాలోని వర్షాల తీవ్రత, వరద ఉధృతి, నష్టపరిస్థితులపై మంత్రికి వివరాలు అందించారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ, ఎలాంటి అప్రమత్తత లోపం జరగకుండా చూడాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. వర్షం పూర్తిగా ఆగే వరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు అధికారులకు మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రత్యక్ష పర్యటనలు నిర్వహించాలి. లోతట్టు ప్రాంతాల ఇళ్లను పరిశీలించి, నీరు చేరిన ఇళ్లలోని ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలి. నీటి ముంపు ఉన్న ఇళ్ల నుంచి నీరు బయటికి పంపే చర్యలు చేపట్టాలి. విద్యుత్, వ్యవసాయ, మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖలు తక్షణం నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలి. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు మనోధైర్యం కల్పించాలి. గ్రామాల్లో శానిటేషన్ పనులను వేగవంతం చేసి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలి. వాగులు, చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలి. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తలు పాటించాలి. వాతావరణం అనుకూలించగానే స్వయంగా జిల్లాలో పర్యటించి పరిస్థితులను సమీక్షిస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.