అజారుద్దీన్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోకుండా కుట్రలు చేస్తున్నారు

మహమ్మద్ అజారుద్దీన్ ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.

By -  Medi Samrat
Published on : 30 Oct 2025 7:30 PM IST

అజారుద్దీన్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోకుండా కుట్రలు చేస్తున్నారు

మహమ్మద్ అజారుద్దీన్ ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అజారుద్దీన్ దేశ క్రికెట్ జట్టుకు సుధీర్ఘ కాలం కెప్టెన్ గా వ్యవహరించారు.. క్రికెట్ లో దేశానికి ఎంతో సేవ చేశారు.. దేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన క్రీడాకారుల్లో అజారుద్దీన్ ఒకరు.. అజారుద్దీన్ లాంటి విఖ్యాత క్రీడాకారుడికి మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తుంటే బీజేపీ అడ్డుకుంటోంది.. అజారుద్దీన్ పైన బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు.

గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ తెర వెనుక బంధం గురించి ఇప్పటికే కల్వకుంట్ల కవిత స్పష్టం చేసింది.. వీరిద్దరి తెర వెనక బంధాన్ని ఆమె బయటపెట్టింది.. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సహకారంతోనే బీజేపీ రాష్ట్రంలో 8 సీట్లు గెలుచుకుందన్నారు. జూబ్లీ హిల్స్ లో తమకు గెలిచే అవకాశం లేదని బీజేపీ కి తెలుసు. అందుకే బీఆర్ ఎస్ కు లాభం చేయడం కోసం చాలా లేట్ గా బలహీనమైన అభ్యర్థి ని బీజేపీ ప్రకటించిందని ఆరోపించారు.

జూబ్లీహిల్స్ లో మైనార్టీలు ఎవరూ బీజేపీ కి ఓటు వేయరు.. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు లాభం కల్గించడం కోసమే అజారుద్దీన్ ను మంత్రి కాకుండా బీజేపీ అడ్డుకుంటోందన్నారు. అజారుద్దీన్ తో ప్రమాణ స్వీకారం చేయించకుండా రాష్ట్ర గవర్నర్ పైన బీజేపీ ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం.. నాకున్న సమాచారం మేరకు వారు గొప్ప వ్యక్తి.. అలా చేయరు అని భావిస్తున్నానన్నారు. కుట్రలో భాగంగా ఎన్నికల కమిషన్ కు బీజేపీ ఫిర్యాదు చేసింది. గతంలో రాజస్థాన్ లో ఉప ఎన్నిక అభ్యర్థి ని మంత్రి వర్గంలోకి తీసుకుంది.. శ్రీ గంగానగర్ జిల్లా శ్రీ కరణ్ పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పాల్ సింగ్‌ను డిసెంబర్ 30న రాష్ట్ర మంత్రి వర్గంలోకి ఏకంగా ఉప ఎన్నిక అభ్యర్థిని మంత్రి వర్గంలోకి బీజేపీ తీసుకుంది.. ఉపఎన్నికకు 20 రోజుల ముందు ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనం అన్నారు.

కేవలం మైనార్టీ అన్న ద్వేషంతోనే బీజేపీ అజారుద్దీన్ ప్రమాణస్వీకారాన్ని అడ్డుకుంటోంది.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను మైనార్టీలు అర్థం చేసుకోవాలన్నారు. బై ఎలక్షన్ కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకే.. ప్రమాణ స్వీకారం నియోజకవర్గం బయట జరుగుతుందన్నారు. అజారుద్దీన్ జూబ్లీహిల్స్ లో పోటీ చేయడం లేదు.. ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీ.. ఎవరెన్ని కుట్రలు చేసినా.. సమాజంలోని అన్ని వర్గాలకు భాగస్వామ్యం కల్పించడం కాంగ్రెస్ మూల సిద్ధాంతం అన్నారు. ఈ క్రమంలో అజారుద్దీన్‌కు కల్పిస్తున్న అవకాశంపై కుట్రలు చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు.

రాష్ట్ర మంత్రుల మధ్య స్పష్టమైన అవగాహన, ఆలోచన, ప్రణాళిక నిర్ణయాల పట్ల నిబద్ధత ఉన్నాయని స్ప‌ష్ట‌త ఇచ్చారు. తుఫానుకు సంబంధించి ప్రభుత్వం 46 గంటల ముందే అప్రమత్తమయిందని.. 24 గంటలు పనిచేసింద‌ని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్, చీఫ్ సెక్రటరీతో పాటు మొత్తం యంత్రాంగం అప్రమత్తమై కావలసిన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ముందస్తు చర్యల మూలంగా భారీ ప్రాణ, ఆస్తి, ఇతర నష్టం జరగకుండా చూడగలిగామ‌ని తెలిపారు. అన్ని ప్రయత్నాలు చేసినా ప్రకృతి విపత్తు వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి. నష్టాలు అంచనా వేసి నష్టపోయిన వారికి సహాయం చేస్తాం. తుఫాను నష్టంపై ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో ఆలోచన చేస్తుందన్నారు.

Next Story