రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలందరూ కలిసి రావాలి: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

By Knakam Karthik  Published on  8 March 2025 3:40 PM IST
Telangana, Hyderabad, Deputy Cm Bhatti Vikramarka, Congress Government, Telangana Mps

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలందరూ కలిసి రావాలి: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మన సమస్యలను వివరించాలని ఆయన అన్నారు. ఉన్నత భావాలతో ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్రం నుండి రావాల్సిన నిధుల కోసం పోరాడాల్సి ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన తెలంగాణ ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు గైర్హాజరయ్యారు. కేంద్రం వద్ద పెండింగులో ఉన్న బిల్లులపై ఈ సమావేశంలో చర్చించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ని భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఖరారైన కార్యక్రమాలు ఉండటంతో తాము రాలేమని కిషన్ రెడ్డి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. మల్లు భట్టి విక్రమార్క ఎంపీలందరికీ నిన్ననే ఆహ్వానం పంపించారు.

కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ అంశాలపై చర్చ చేశాం. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా సమావేశం ఏర్పాటు చేశాం. అన్ని రాజకీయ పార్టీల ఎంపీలకు ఆహ్వానం పంపించాం. కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానం పంపించాం. విభజన చట్టం నుంచి రావాల్సిన రాష్ట్ర హక్కులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం. రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి ఎంపీలందరికీ వివరాలు పంపిస్తాం. బీఆర్ఎస్ ఆనాడు చేయాల్సిన ప్రయత్నం సరిగా చేయలేదు. మేము అధికారంలోకి వచ్చాక కేంద్రంపై ఒత్తిడి పెంచాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు అందాలి. ఇంకో సమావేశం ఏర్పాటు చేసి మళ్లీ చెబుతాం. ముందే సమాచారం ఇస్తాం. అప్పుడైనా బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లు కలిసి వస్తారు. కేంద్రప్రభుత్వానికి ఇచ్చిన లేఖలు, సమాచారం ఒక బుక్‌లెట్‌గా రూపొందించాం..అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Next Story