ఒడిశాలో సింగరేణి గని ప్రారంభం..తెలంగాణకే గర్వకారణమన్న భట్టి
సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు నైనీ గని తొలిమెట్టు అని.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
By Knakam Karthik
ఒడిశాలో సింగరేణి గని ప్రారంభం..తెలంగాణకే గర్వకారణమన్న భట్టి
సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు నైనీ గని తొలిమెట్టు అని.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం మహాత్మా జ్యోతి రావ్ ఫూలే ప్రజా భవన్ నుంచి భట్టి విక్రమార్క ఒడిశా రాష్ట్రంలో సింగరేణి చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ ను వర్చువల్‌గా ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సంస్థ తన 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించుకోవడం ఒక సువర్ణ అధ్యాయమని, ఒడిశా రాష్ట్రంలో నైనీ గని ప్రారంభంతో సింగరేణి తన విశ్వవ్యాప్త విస్తరణకు శ్రీకారం చుట్టిందని భట్టి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒడిశాలో గని ప్రారంభించడం సింగరేణి సంస్థకే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆనందకరమైన సందర్భం అన్నారు. ఈ బొగ్గు బ్లాక్ను సింగరేణి కి కేటాయించి తొమ్మిది ఏళ్ళు అయినప్పటికీ వివిధ రకాల అనుమతులు అందడంలో జాప్యం వల్ల ప్రారంభానికి నోచుకోలేదన్నారు. ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, తాను కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని పలుమార్లు కలిసి పూర్తి అనుమతులకు సానుకూలత సాధించామన్నారు. ప్రభుత్వం చూపిన ప్రత్యేక చొరవ వల్లే ఏడాదిలోనే దీనిని ప్రారంభించుకోవడం ప్రజా ప్రభుత్వానికి సింగరేణి అభివృద్ధిపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు.
నేడు ఒడిశాలో ప్రారంభించిన నైనీ బొగ్గు బ్లాకు సింగరేణి విస్తరణలో ఒక తొలి అడుగుగా ఆయన అభివర్ణించారు. ఇక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా సింగరేణి విస్తరిస్తుందన్నారు. త్వరలో సింగరేణి గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నైనీ గని ప్రారంభానికి సహకరించిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డికి, ఒడిశా ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ అగస్థీ బెహరా, ఇతర ప్రజాప్రతినిధులకు తన ధన్యవాదాలు తెలిపారు.