తెలంగాణలో మొదలైన డెంగ్యూ టెన్షన్

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దోమల బెడద కూడా తెలంగాణలో ఎక్కువైంది.

By Medi Samrat  Published on  2 Sept 2024 9:45 PM IST
తెలంగాణలో మొదలైన డెంగ్యూ టెన్షన్

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దోమల బెడద కూడా తెలంగాణలో ఎక్కువైంది. దీంతో డెంగ్యూ కేసులు అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఏడాది సోమవారం నాటికి డెంగ్యూ కేసుల సంఖ్య 6,000 మార్కును దాటి 6,405కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు 25 నాటికి డెంగ్యూ కేసుల సంఖ్య 5,372 గా ఉండగా.. కేవలం ఆరు రోజుల్లోనే 1000 కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదని ఆరోగ్య శాఖ ప్రెస్ నోట్ పేర్కొంది. అదే సమయంలో, చికున్‌గున్యా కేసులు 152 నుండి 178కి, మలేరియా 191 నుండి 200కి పెరిగాయి.

హైదరాబాద్, సూర్యాపేట, మేడ్చల్ మల్కాజిగిరి, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, రంగా రెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వరంగల్ వంటి 10 హైరిస్క్ డెంగ్యూ జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ సమాచారం సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రజలు తీసుకునే ఆహారం, కలుషిత నీరు తీసుకోవడం ఈ సీజన్‌లో అనారోగ్యానికి ప్రధాన కారణమని వైద్యులు తెలిపారు. ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ సీనియర్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

Next Story