కాలేజీలకు కూల్చివేత నోటీసులు.. హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారుల నోటీసులు జారీ చేశారు
By Medi Samrat Published on 28 Aug 2024 2:50 PM GMTబీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారుల నోటీసులు జారీ చేశారు. అధికారులు దుండిగల్ లోని ఎంఎల్ఆర్ ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీ లకు నోటీసులు ఇచ్చారు. చిన్న దామెర చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో కాలేజీలు నిర్మాణం చేపట్టారని అధికారులు నోటీసులు జారీ చేశారు. మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువు అక్రమించారని అధికారులు నోటీ సుల్లో పేర్కొన్నారు. 7 రోజుల్లో నిర్మా ణాలు తొలగించాలని.. లేకపోతే మేమే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు అల్టిమేటం జారీ చేశారు. 489, 485, 458, 484, 492, 489 సర్వే నెంబర్లలో బిల్డింగ్స్, షెడ్స్, వెహికిల్ పార్కింగ్‌తో పాటు కాలేజీ రోడ్లు వేశారని రెవెన్యూ అధికారులు గుర్తించారు.
హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరిలోని 13 చెరువుల్లో కబ్జాల వివరాలు ఇవ్వాలని కోర్టు జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సర్వే చేయించారు. సర్వే అనంతరం కలెక్టర్ ఏడు రోజుల్లో అక్రమంగా కట్టిన కాలేజీలను తొలగించాలని లేనిచో తాము రంగంలోకి దిగి కూల్చివేత పనులు చేపడతామని పేర్కొంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు.
నోటీసులపై హై కోర్టును ఆశ్రయించారు ఎంఎల్ఆర్ఐటీ సంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి. కూల్చివేతలను ఆపాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆక్రమణలను ఏడు రోజుల్లోనే తొలగించాలని నోటీసులు ఇచ్చారని.. హైడ్రా ఎటువంటి చట్టబద్దత లేని సంస్థ అని, కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా సృష్టించబడిన సంస్థ మాత్రమేనని పిటిషన్ లో పేర్కొన్నారు. ఉదయం 6 గంటలకు నిర్మాణాలు కూల్చడం ఏంటని ప్రశ్నించారు. హైడ్రా చర్యలు సుప్రీం కోర్టు నిర్దేశించిన చట్టానికి విరుద్ధం అని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీనిపై ఎలాంటి తీర్పు వెల్లడవుతుందో అనే ఉత్కంఠ యాజమాన్యంలో నెలకొంది.