ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి.? ఆ సందేశం ఇవ్వాల‌నే బీజేపీ భావిస్తోందా..?

సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి తర్వాత ఢిల్లీకి మరోసారి మహిళా ముఖ్యమంత్రి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

By Medi Samrat  Published on  11 Feb 2025 11:40 AM IST
Delhi, BJP, Woman Chief Minister, National news

ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి.? ఆ సందేశం ఇవ్వాల‌నే బీజేపీ భావిస్తోందా..?

సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి తర్వాత ఢిల్లీకి మరోసారి మహిళా ముఖ్యమంత్రి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహిళలకు గౌరవం, భద్రత కల్పిస్తామని 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ.. మహిళా ఎమ్మెల్యేకు ప్రభుత్వ నాయకత్వాన్ని అప్పగించడంపై సీరియస్‌గా ఆలోచ‌న‌లు చేస్తుంద‌ని తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కంటే ముందే వారి ఖాతాల్లో రూ.2,500 జమ చేస్తామని ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు హామీ ఇచ్చారు.

మూలాల ప్రకారం.. బీజేపీ ఒక మహిళా సీఎం ద్వారా ప్రధాని హామీని నెరవేర్చాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. కాగా, సీఎం రేసులో ఉన్న ఎమ్మెల్యేలు తమ తమ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ప్రధాని విదేశీ ప‌ర్య‌ట‌న‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలో మహిళా ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి చేయడం వెనుక ఒక కారణం ఏమిటంటే.. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రల‌లో ఒక్క‌ మహిళా ముఖ్యమంత్రి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదే సమయంలో దేశ రాజధానికి మహిళను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు మహిళా సాధికారత సందేశాన్ని ఇవ్వాలని కూడా పార్టీ భావిస్తోంది.

ఈ ఎన్నికల్లో బీజేపీకి చెందిన నలుగురు మహిళా అభ్య‌ర్ధులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. షాలిమార్‌బాగ్‌ నుంచి రేఖా గుప్తా, గ్రేటర్‌ కైలాష్‌ నుంచి శిఖరాయ్‌, వజీర్‌పూర్‌ నుంచి పూనమ్‌ శర్మ, నజఫ్‌గఢ్‌ నుంచి నీలం పెహల్వాన్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

రేఖా గుప్తా ఢిల్లీ ప్రదేశ్ బీజేపీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు. ఆమె 2022లో మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.

శిఖా రాయ్ గ్రేటర్ కైలాష్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఆమె సీనియర్ ఆప్ నాయకుడు, మంత్రి సౌరభ్ భరద్వాజ్‌ను ఓడించారు. ఆమె రెండుసార్లు కౌన్సిలర్.

రేఖ, శిఖాల పేర్లు బ‌లంగా విన‌ప‌డ‌టంతో పాటు ఇరువురు ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్నట్లు ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. ఒక‌వేళ మ‌హిళా సీఎం ఎంపిక‌ జరిగితే ఒక మహిళా ముఖ్యమంత్రిని తొలగించిన తర్వాత ఆమె స్థానంలో మరో మహిళా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అతిషీని ముఖ్యమంత్రిని చేసింది. ఇంతకు ముందు కాంగ్రెస్ హయాంలో షీలా దీక్షిత్ పదేళ్లపాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. షీలా కంటే ముందు సుష్మా స్వరాజ్ బీజేపీ హయాంలో కొన్ని నెలల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఢిల్లీలో సోమవారం ఊహాగానాలతో నిండిన రాజకీయ నిశ్శబ్దం ఎక్కువగా ఉంది. ఆదివారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు.. సీనియర్ నేతలతో సమావేశమైనట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. సీఎం అభ్య‌ర్ధిపైనే చర్చ జరగవచ్చని భావిస్తున్నారు. అయితే, సమావేశంలో ఎలాంటి తీర్మానం చేశారు, ఎవరి పేరు ఆమోదం పొందింది అనేది మిస్టరీగా మిగిలిపోయింది.

ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన ప్రవేశ్ వర్మ కూడా ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆదివారం ఆయన, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఆదివారం సాయంత్రం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.

అదే సమయంలో సోమవారం ఎమ్మెల్యేలతో భేటీ కాకుండా సీనియర్ నేతలు టెలిఫోన్ ద్వారా వారితో మాట్లాడారు. ఈ విషయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధికారుల నుంచి కూడా అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. అదే సమయంలో ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఎంపీలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసేందుకు సమయం కోరారు. ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాసినా.. సోమవారం ఆయనను కలవలేదు. మరో రెండు రోజుల్లో కలుద్దామని అంటున్నారు.

Next Story