ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ క‌విత‌కు బిగ్ షాక్‌

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం

By Medi Samrat  Published on  16 March 2024 6:26 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ క‌విత‌కు బిగ్ షాక్‌

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 18 తేదీ నుంచి 23 వరకు కస్టడీకి అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో ప్రత్యేక న్యాయమూర్తి నాగ్‌పాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు 7 రోజులపాటు ప్రశ్నించనున్నారు. ఈ వారం రోజులపాటు కవిత ఈడీ కార్యాలయంలోనే ఉండాల్సి ఉంటుంది. 7 రోజుల పాటు ప్రశ్నించిన అనంతరం మార్చి 23న మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరోసారి ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె, 46 ఏళ్ల ఎమ్మెల్సీని శుక్రవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసి అర్థరాత్రి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమెను కోర్టు నుండి 10 రోజుల కస్టడీని కోరింది. ఈడీ కస్టడీలో తనకు పలు మినహాయింపులు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టును శనివారం కోరారు. ఈడీ కస్టడీ సమయంలో ప్రతిరోజు తాను బంధువులను కలిసేందుకు అనుమతివ్వాలని, తన లాయర్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కవిత కోరగా.. కోర్టు అందుకు అంగీకరించింది. అలాగే తనకు పుస్తకాలు చదివేందుకు వెసులుబాటు కల్పించాలని, కేసుకు సంబంధించినవి రాసుకోవడానికి అనుమతివ్వాలని కోరారు. ప్రతిరోజు ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరగా న్యాయస్థానం ఆమోదం తెలిపింది. కవితకు ఈడీ కేంద్ర కార్యాలయంలో మహిళా అధికారుల భద్రతతో ప్రత్యేక గదిని కేటాయిస్తారు.

Next Story