తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం మరో షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్ ప్రకటించారు. పది మంది జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశ్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశానని . కాంగ్రెస్‌లో తనకు అంచెలంచెలుగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చారని.. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమనే తాను నమ్ముతానని ఆయన అన్నారు. ఆ నమ్మకంతోనే కాంగ్రెస్‌లో పనిచేసుకుంటూ వచ్చానని అన్నారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించారని అన్నారు.
రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీలో అరాచకం రాజ్యమేలుతోందని.. రేవంత్ తప్పు చేస్తే అడిగే వారే లేరన్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. సర్వేల పేరుతో తప్పుడు నివేదికలు ఇచ్చి మోసం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి, సునీల్, మాణిక్కం ఠాగూర్‌లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారన్నారు. దాసోజు శ్రవణ్ రాజీనామా చేయనున్నట్లుగా వార్తలు వినిపించిన వెంటనే ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో శ్రవణ్ ఇంటికి పార్టీ సీనియర్లు కోదండరెడ్డి, మహేశ్ గౌడ్‌లతో కూడిన ప్రతినిధి బృందాన్ని పంపింది.