బెదిరింపు కాల్స్‌పై పోలీసుల‌కు దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

Dasoju Shravan complains to police about threatening calls. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచ‌రులు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ శుక్రవారం అన్నారు

By Medi Samrat  Published on  14 July 2023 1:45 PM GMT
బెదిరింపు కాల్స్‌పై పోలీసుల‌కు దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచ‌రులు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ శుక్రవారం అన్నారు. రేవంత్ రెడ్డి అనుచరులుగా చెప్పుకునే కొందరు వ్యక్తులు.. గురువారం రాత్రి 12.15 నుంచి తన ఫోన్‌కు పదే పదే కాల్స్ చేసి బెదిరిస్తున్నార‌ని పేర్కొన్నారు. రేవంత్ ను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అసభ్య పదజాలంతో దూషించార‌ని.. ఇంకా మాట్లాడితే లేకుండా చేస్తామని బెదిరిస్తున్నార‌ని శ్రవణ్ ట్విట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.

ఈ విష‌య‌మై.. ఆయ‌న‌ సైబర్ క్రైమ్స్ డిపార్ట్‌మెంట్, సంబంధిత పోలీసు అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపు కాల్స్‌పై విచారణ జరిపి దోషులను గుర్తించి, వారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొనేలా చూడాలని ఫిర్యాదులో కోరారు. తెలంగాణలో బెదిరింపు, రౌడీ రాజకీయాల సంస్కృతిని పెంచి పోషించే పనిలో రేవంత్ రెడ్డి నిమగ్నమై ఉండడం దురదృష్టకరమ‌న్నారు. గతంలో కూడా తన అనుచరుల ద్వారా వీ హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గా రెడ్డి తదితర సీనియర్లతో సహా తన సొంత పార్టీ సభ్యులపై ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డార‌ని.. రేవంత్‌ ఇలాంటి వ్యూహాలను ప్రయోగించడం ఇదే మొదటిసారి కాదని ఫిర్యాదులో వెల్ల‌డించారు.

ఈ రౌడీ రాజకీయాలు, చౌకబారు వ్యూహాలు సరైన కారణం, ప్రజాస్వామ్యం, న్యాయం కోసం పోరాడకుండా నన్ను నిరోధించలేవని రేవంత్ తెలుసుకోవాలని శ్రవణ్‌ హెచ్చరించారు. కాంగ్రెస్ వంటి 125 ఏళ్ల‌ పార్టీలో ఇటువంటి చ‌ర్య‌లు ఎలా ప్రోత్స‌హిస్తున్నారంటూ ప్రశ్నించారు. బెదిరింపు కాల్‌లపై బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి, అతని గూండాలు చేస్తున్న ఈ రకమైన బెదిరింపులు, రౌడీ రాజకీయాలు ఆమోదయోగ్యం కాదు.

ప్రజాస్వామ్యంలో ఇలాంటి వారిని అనుమతించినట్లయితే.. వారు సమాజంలోని ప్రజాస్వామ్య నిర్మాణాన్ని నాశనం చేస్తారు. అసమ్మతిని అణిచివేయడానికి హింసను కూడా ఆశ్రయిస్తారని ఫిర్యాదులో వెల్ల‌డించారు. ఇటువంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదులో కోరారు.


Next Story