శాసనసభలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ఉండగా.. బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ సభ్యులపై దానం పరుషపదజాలం ఉపయోగించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్‌ను.. ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోగా.. దానం నాగేందర్ సహనం కోల్పోయి నోటికొచ్చినట్టుగా మాట్లాడారు.ఒక్కొక్కరి తోలు తీస్తానంటూ బీఆర్ఎస్ సభ్యులను హెచ్చరించారు. మీ బండారం బయటపెడ్తానంటూ దానం ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఈ వ్యాఖ్యలపై దానం నాగేందర్ వివరణ ఇచ్చారు. తాను సభలో గతంలో ఎప్పుడూ ఇలా మాట్లాడలేదని.. సభలో తాను సీనియర్ అని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. తనను రెచ్చగొట్టారని, దీంతో తాను మాట్లాడవలసి వచ్చిందన్నారు. తన గురించి, తన పనితీరు గురించి అందరికీ తెలుసునన్నారు.