ఎల్‌కే అద్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించడాన్ని పలువురు రాజకీయ నాయకులు తప్పుబడుతూ ఉన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అయితే జైల్లో ఉండాల్సిన ఆయనకు భారతరత్న ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిరం కోసం 1990లో అద్వానీ చేపట్టిన రథయాత్ర దేశంలో మతకల్లోలాలు సృష్టించిందని విమర్శించారు. ఆ ఘర్షణల్లో ఎందరో ప్రాణాలు కోల్పోవడంతో వందలాది మంది గాయాలపాలయ్యారని గుర్తు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో ఆయన ముద్దాయిగా కూడా ఉన్నారన్నారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తీరు సరిగా లేదన్నారు.
ఇక ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 1990లో అద్వానీ చేపట్టిన రథయాత్రకు సంబంధించిన మ్యాప్‌ని షేర్ చేస్తూ.. ఆ యాత్ర సందర్భంగా ఎంతోమంది చనిపోయారని విమర్శించారు. వీటన్నింటికి కారణమైన అద్వాణీకి భారతరత్న దక్కాల్సిందేనంటూ సెటైర్లు వేశారు. భారతరత్నకు ఎల్‌కే అద్వానీ నిజంగా అర్హుడే. హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధులు సోపానాలు తప్ప మరొకటి కాదని అసదుద్దీన్ ట్వీట్ చేశారు.