తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అలానే ఉన్నాయని.. ఇప్పటివరకు వాటికి నెరవేర్చలేకపోయిందని వ్యాఖ్యానించారు. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లుతోందని కూనంనేని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హామీలపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళితే బాగుంటుందని సీపీఐ తరపున సూచిస్తున్నట్లు ఎమ్మెల్యే కూనంనేని అన్నారు.
లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో తాము బలంగా ఉన్న చోట పోటీ చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీని కలుపుకుని పోతామని వెల్లడించారు. అదే విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్థుల్లో మద్దతు ఎవరికి ఇవ్వాలనే దానిపై పార్టీలో చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేయడాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని చెప్పారు.