సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతల భేటీ

నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారని ఎమ్మెల్సీ, టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు

By Medi Samrat  Published on  25 May 2024 8:13 AM GMT
సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతల భేటీ

నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారని ఎమ్మెల్సీ, టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ భేటీలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, చివరి రోజు ప్రచార సరళిపై చర్చ జ‌రిగిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీ లు పూర్తిగా కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తున్నాయని వెల్ల‌డించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అని ధీమా వ్య‌క్తం చేశారు.

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాలని ప‌ట్ట‌భ‌ద్రుల‌కు పిలుపునిచ్చారు. ఇవాళ్టితో ప్రచార ప్రక్రియ పూర్తవుతోందన్నారు. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే తీన్మార్ మల్లన్న గెలవాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు సీపీఐ నాయకులు కృషి చేయాలని పిలుపునిస్తున్నామ‌న్నారు. తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండని పిలుపునిచ్చారు. పొత్తులో భాగంగా సీపీఐగా కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచామ‌ని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మా మద్దతు కాంగ్రెస్ కు ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేసిన‌ట్లు వెల్ల‌డించారు. మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్ ను గెలిపించాలని సూచించారు. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నామ‌న్నారు. ప్రజా సంక్షేమం వర్ధిల్లాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని జనసమితి కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేశారు.

సీపీఎం నేత‌ ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం కూడా కాంగ్రెస్ కు మద్దతు పలుకుతోందన్నారు. విద్యాధికులు లోతుగా ఆలోచించాలి. ప్రస్తుత సామాజిక,రాజకీయ పరిస్థితులను అర్ధం చేసుకుని ఓటు వేయండి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను గెలిపించండని పిలుపునిచ్చారు.

Next Story