టీఆర్ఎస్ చెవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఎంపీ రంజిత్ రెడ్డి ఈ విషయాన్నితెలిపారు. "టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు,అధికారులకు ప్రజలకు నా మనవి. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత కొన్ని రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను." అని ఎంపీ రంజిత్ రెడ్డి చెప్పారు. తాను కోలుకునే వరకు ప్రజలు ఎవరూ తనను కలవొద్దని ఎంపీ రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడిగా రంజిత్ రెడ్డి కొనసాగుతున్నారు. కాగా ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అనుచురులు కోరుకుంటున్నారు.
ఇటీవల టీఆర్‌ఎస్ నాయకులు కరోనా బారిన పడటం తీవ్ర కలకలం రేపుతోంది.. ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా సోకింది. ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని తెలిసింది. గత వారం రోజులుగా ఢిల్లీలో పర్యటించిన ఎర్రబెల్లి.. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత కొవిడ్ పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. అలాగే తనతో సన్నిహితంగా ఉన్నవారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు.