రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.. గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 23 Jan 2025 6:30 AM ISTనిరంతరంగా రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ..గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. జనవరి 26వ తేదీన రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. కార్డులు అందరికీ అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. ఇప్పుడు రేషన్ కార్డులు రాని వారు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, అర్హులైన అందరికీ అందజేస్తామని స్పష్టం చేశారు. అర్హులకు కార్డులు అందేలా చూడాల్సిన బాధ్యతను ప్రజా ప్రతినిధులుగా తాము తీసుకుంటామని చెప్పారు. రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కులగణన సర్వే, ప్రజా పాలన దరఖాస్తులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇచ్చిన అప్లికేషన్ల ఆధారంగా రేషన్ కార్డులను గుర్తించినట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డులకు దొడ్డు బియ్యం ఇచ్చేవారని, ఇప్పుడు తమ ప్రభుత్వం ప్రతి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యం ఇవ్వబోతుందని తెలిపారు. గత ప్రభుత్వం రేషన్ బియ్యానికి ప్రతి సంవత్సరం రూ.7 వేల కోట్లు వ్యయం చేసి ఖర్చు చేసి ఇచ్చినా దొడ్డు బియ్యం అని ఎవరూ తినకపోయేవారని అన్నారు. కార్డుల నుంచి ఇచ్చే బియ్యాన్ని లబ్ధిదారులు బయట అమ్ముకునేవారని చెప్పారు.