మహిళలకు నెలకు రూ.2500 సాయం.. త్వరలోనే అమలు!
మహిళలకు నెలవారీ రూ.2,500 సహాయాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 5 Jan 2024 6:52 AM ISTమహిళలకు నెలకు రూ.2500 సాయం.. త్వరలోనే అమలు!
హైదరాబాద్ : మహాలక్ష్మి హామీ కింద మూడు వాగ్దానాలలో ఒకటైన మహిళలకు నెలవారీ రూ.2,500 సహాయాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం సేకరిస్తున్న దరఖాస్తులకు జనవరి 6 చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తుదారులందరి ఆన్‌లైన్ డేటా ఎంట్రీని జనవరి 17లోగా పూర్తి చేయాలని, లబ్ధిదారులను గుర్తించేందుకు ముందుగా మహాలక్ష్మి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
లబ్ధిదారులను ఎంపిక చేయడానికి రేషన్ కార్డులను ప్రధాన అర్హత ప్రమాణంగా ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చవుతుంది, అంచనా వ్యయంపై నివేదిక సమర్పించాలని ఆర్థిక శాఖ అధికారులను కోరారు. మహాలక్ష్మి హామీ కింద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే డిసెంబర్ 10న ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. మహా లక్ష్మి పథకం కింద వాగ్దానం చేయబడిన ఇతర ప్రయోజనం రూ. 500కి ఎల్‌పిజి సిలిండర్లు. ఉచిత బస్సు ప్రయాణ పథకం పౌరులలో ప్రజాదరణ పొందింది.
ప్రారంభించినప్పటి నుండి 6.5 కోట్ల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని పొందుతున్నారు. ఈ ప్రయోజనం కింద టిఎస్‌ఆర్‌టిసి జారీ చేసే 'జీరో టిక్కెట్‌ల' కోసం ప్రభుత్వం రోజుకు సుమారు రూ.10 కోట్లు వెచ్చిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 28 నుంచి అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులు, డివిజన్లలో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఆరు హామీల్లో ఐదు హామీలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తులు కోరుతోంది.