తిరుపతి లడ్డూ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఎన్‌డిడిబి ల్యాబ్ కూడా ధృవీకరించింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో చేప కొవ్వు, ఎద్దు కొవ్వుతో ప్రసాదం చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. దేవుడు దగ్గరే కరప్షన్ చేస్తారా.? అని ప్రశ్నించారు. తప్పు చేసింది ఎవరైనా సరే.. దేవుడు వారిని ఊరికే వదలడన్నారు. టీడీపీ వాళ్లు కావాలని ఆరోపణ చేస్తున్నారు అని ప్రతిపక్షం అనే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈరోజే ఈ విషయంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. దేవుడికి అన్యాయం జరిగింది కనుక వెంటనే దీని వెనక ఎవరున్నా కనిపెట్టి వారికి శిక్ష వేయాలన్నారు.