దీక్ష బంద్ చేస్తా అని కేసీఆర్ రిక్వెస్ట్ చేశారు : వీహెచ్
కేసీఆర్ 2009లో చేసింది నిజమైన దీక్షనా.? నాకు అనుమానం వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు అన్నారు.
By Medi Samrat Published on 28 Nov 2023 4:52 PM ISTకేసీఆర్ 2009లో చేసింది నిజమైన దీక్షనా.? నాకు అనుమానం వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం నుండి నిమ్స్ తీసుకొస్తే 10 రోజులు ఉన్నారు.. కేసీఆర్ కి ఏమైనా అయితే పెట్రోల్ పోసుకొని చస్తామని హరీష్ రావు చెప్పారు.. అక్కడ 100 పెట్రోల్ డబ్బాలు ఉన్నాయి కానీ.. ఒక్క అగ్గిపెట్ట లేదా అని ఎద్దేవా చేశారు. సాయుధ దళాల ప్రత్యేక చట్టంపై ఇరోమ్ షర్మిల 13 సంవత్సరాలు దీక్ష చేసిందని అన్నారు.
సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 9ని కాదని.. కేసీఆర్ దీక్ష ప్రారంభించిన రేపటి రోజున దీక్షా దివాస్ అంటున్నారు.. కానీ అది దొంగ దీక్షా దివాస్ అని అన్నారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ దీక్ష చేస్తుంటే నేను వెళ్ళాను.. నాతో కేసీఆర్ అహ్మద్ పటేల్ తో చెప్పించమని రిక్వెస్ట్ చేశారు. దీక్ష బంద్ చేస్తా అన్నారని తెలిపారు.
తెలంగాణ కోసం సోనియా గాంధీకి 41మంది ఎమ్మెల్యేలం సంతకాలు చేసి పంపామన్నారు. 13 ఏళ్ళు దీక్ష చేసిన ఈరోమ్ షర్మిల చనిపోలేదు. 10 రోజుల దీక్షకే చనిపోయేవాడివా.. ఓట్ల కోసమే చావు నోట్లో తల పెట్టి వచ్చా అని చెప్తున్నావ్ అని మండిపడ్డారు. తెలంగాణ కోసం నువ్వే కాదు మేమంతా కొట్లాడమన్నారు. మా ఎంపీలు, మేము పార్లమెంట్ లో పోరాడమన్నారు.
ఇందిరా గాంధీని వాజ్‌పేయి కాళీమాతతో పోల్చారు.. కానీ నువ్వు ఇందిరా గాంధీని విమర్శిస్తున్నావ్ అని ఫైర్ అయ్యారు. ప్రజల్లో మార్పు వచ్చింది.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. జోడోయాత్ర తరువాత మార్పు వచ్చింది.. మేము ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తామన్నారు.