బీజేపీలో అమిత్ షా, మోదీ తప్ప మిగితా వాళ్ళందరూ రబ్బరు స్టాంప్‌లే..
Congress Senior Leader Comments On BJP Leaders. ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ లేదనే పచ్చి నిజం చెబితే
By Medi Samrat Published on 21 Dec 2022 3:07 PM ISTఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ లేదనే పచ్చి నిజం చెబితే.. ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ఎందుకు క్షమాపణ చెప్పాలి అనేది బీజేపీ వాళ్ళు చెప్పాలని అడిగారు. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ వాళ్ళు లేదనేది వాస్తవం కాదా..? అందువల్ల మల్లికార్జున్ ఖర్గే క్షమాపణ చెప్పాల్సిన అవసరం కంటే.. బీజేపీ వాళ్ళే క్షమాపణ చెప్పాలని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారని విమర్శించారు.
మల్లికార్జున ఖర్గేను రబ్బరు స్టాంప్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒక దళిత నేతగా ఖర్గే ఓటమి ఎరగని నాయకుడని.. 8 సార్లు ఎమ్మెల్యే గా, మూడుసార్లు ఎంపీగా, గెలవడమే కాకుండా కర్ణాటక లో హోమ్, పరిశ్రమలు, నీటి పారుదల మంత్రిగా, సీఎల్పీ నేతగా కేంద్రంలో రైల్వే, లేబర్ మంత్రిగా పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులుగా పని చేసిన అనుభవం ఉందని తెలిపారు. ఆయన ఎన్నికల ద్వారా అత్యధిక మెజారిటీ తో గెలిచిన ఏఐసీసీ అధ్యక్షుడు. ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రెండు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ గెలిచాయని.. అలాంటి వ్యక్తిని రబ్బర్ స్టాంప్ అంటారా..? అంటూ ధ్వజమెత్తారు.
బీజేపీలో అమిత్ షా, మోదీ తప్ప మిగితా వాళ్ళందరూ రబ్బరు స్టాంప్ లేనని కామెంట్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించిన ఘనత ఖర్గేది.. దళితులను అవమాన పరిచే విధంగా బీజేపీ వాళ్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ సిద్ధాంతాలే నేటికి కొనసాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ అంటే వ్యక్తులు కాదు ఒక సిద్ధాంతం అని తెలిపారు. బీజేపీ కి ఏ ఐడియాలజీ లేకనే ఇతర పార్టీల నుంచి చేరికలు చేసుకుంటున్నారని విమర్శించారు.