జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి నేనే, హైకమాండ్ టికెట్ నాకే ఇస్తుంది: అజారుద్దీన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి తానేనని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజారుద్దీన్ అన్నారు
By Knakam Karthik
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి నేనే, హైకమాండ్ టికెట్ నాకే ఇస్తుంది: అజారుద్దీన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి తానేనని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజారుద్దీన్ అన్నారు. వంద శాతం తాను పోటీలో ఉన్నానని, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అజారుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు..అందులో అజారుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ టికెట్ వేరే అభ్యర్థికి ఇస్తుందని పుకార్లు వస్తున్నాయి అవన్నీ నిజం కాదు, టికెట్ నాకే వస్తుంది. పార్టీ కోసం చాలాకాలంగా కష్టపడుతున్నాను, అధిష్టానం నాకే టికెట్ ఇస్తుంది. గతంలో కాంగ్రెస్ ఓటమికి కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం గెలుపు అవకాశాలు ఉన్నాయి. నాకు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఆశీర్వాదాలు ఉన్నాయి...అని అజారుద్దీన్ పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల అనుభవాలను గుర్తుచేసుకుంటూ చివరి క్షణంలో టికెట్ కేటాయించినప్పటికీ, నియోజకవర్గంలో తాను గట్టి పోటీ ఇచ్చానని అజారుద్దీన్ తెలిపారు. చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశానని అన్నారు. అయితే, రానున్న ఉప ఎన్నికలో తనకు టికెట్ లభించదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి వదంతులను నమ్మవద్దని కోరారు.ఈసారి జరగబోయే ఉప ఎన్నికలో తాను తప్పకుండా విజయం సాధిస్తానని అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులందరి సహకారంతో గెలుపొంది, ఆ విజయాన్ని రాహుల్ గాంధీకి కానుకగా అందిస్తానని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని అజారుద్దీన్ తెలిపారు.