తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంట్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు వాయిదా తీర్మానం ప్రతిపాదనను పంపించారు. కాగా ఈ ఉడాది ఖరీఫ్ సీజన్‌కు తెలంగాణ రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. ఆగస్టు 13వ తేదీ వరకు 6.60 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉందని ఎంపీ చామల వెల్లడించారు.
కానీ ఇప్పటివరకు కేవలం 4.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయినట్లు వాయిదా తీర్మానంలో పేర్కొన్నారు. ఇందువల్ల రాష్ట్రంలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కొరత ఏర్పడినట్లు ఎంపీ చామల ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు అవసరమైన యూరియా దొరకక రైతుల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నట్లు ఎంపీ చామల పేర్కొన్నారు. జూన్‌లో రావాల్సిన నైరుతి రుతుపవనాలు ముందుగానే ఈ ఏడాది మే 26న రాష్ట్రానికి వచ్చాయి. సకాలంలో యూరియా అందకపోవడంతో ఆ ప్రభావం పంటలపై తీవ్రంగా పడుతుందని ఎంపీ ఆందోళన చేశారు. రాష్ట్రంలో ఉత్పన్నమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యూరియా కొరత అంశాన్ని లేవనెత్తేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఎంపీ చామల కోరారు.