కాంగ్రెస్ పార్టీ తన ప్రాణమని.. రేపటి నుంచి తానేంటో చూపిస్తానంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ కార్యాలయంలో వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నుంచి తన ఉద్యమం మొదలు పెడుతానన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ప్రాణమని.. సోనియా గాంధీ తన దేవత అంటూ కోమటి రెడ్డి మాట్లాడారు. తమ పార్టీ నాయకులే అప్పుడు దయ్యం అని.. ఇప్పుడు దేవత అని అంటున్నారని చెప్పారు. పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకొని పదవులు పంపకాలు.. 72 - 78 సీట్లు వస్తాయని మినిస్టర్, సీఎంల పదవులు పంకాలు చేసుకున్నారని విమర్శించారు. తాను ఒక జిల్లా నాయకుడిని.. వాళ్లంతా పెద్ద గొప్ప నాయకులు అంటూ ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ లేదనుకుంటే ఆరు వేల ఓట్లు వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తది అనుకుంటే డిపాజిట్లు కూడా రాలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేటీఆర్ సూటు బూటు వేసుకుంటే పెట్టుబడులు రావని.. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి వల్లే ఇప్పుడు పెట్టబడులు వస్తున్నాయన్నారు. రైతుల గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడరు. వారి కష్టాల గురించి ఎందుకు నోరు మెదపరు అంటూ వెంకటరెడ్డి ప్రశ్నించారు. రైతుబంధు వల్ల ఎవరికి ఉపయోగం అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ ఛత్తీస్‌ఘడ్ సీఎంని చూసి కేసీఆర్ బుద్ది తెచ్చుకోవాలన్నారు. గత కొంత కాలంగా కోమటిరెడ్డి.. తన సొంత పార్టీ నేతలపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని బుజ్జగించే బాధ్యతను సీనియర్ నేత వి.హనుమంతరావుకు అప్పగించింది కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ.