రాష్ట్రానికి నిధులు రాకుండా చేస్తుంది ఆయనే..కేంద్రమంత్రిపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
కేంద్రంలోని బీజేపీ చిత్తశుద్ధి లేని పాలన చేస్తుందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
By Knakam Karthik
రాష్ట్రానికి నిధులు రాకుండా చేస్తుంది ఆయనే..కేంద్రమంత్రిపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
కేంద్రంలోని బీజేపీ చిత్తశుద్ధి లేని పాలన చేస్తుందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిపై సీరియస్ అయ్యారు. పాలన చేయకపోతే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఆయన కూడా కాంగ్రెస్‌లో పదవులు నిర్వహించిన వారే. మోడీ చేతకాని పాలనపై మహేశ్వర్ రెడ్డి మాట్లాడాలి అని డిమాండ్ చేశారు.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, తెలంగాణ వాటా 50 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి అని కౌంటర్ ఇచ్చారు. 15 లక్షల నల్లధనం బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తాం అన్నారు ఏమైంది అని ప్రశ్నించారు. బీజేపీకి అనుకూలంగా ఉండే బడాబాబుల లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్ బకాయిలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసింది కదా? దేశాన్ని లూటీ చేసి విదేశాలకు వెళ్లారు. కేంద్రం ప్రభుత్వం తలుచుకుంటే వారిని అరెస్టు చేయొచ్చు కానీ, చేయడం లేదు అని విమర్శించారు.
కుల, మతాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ అనుకుంటుంది. నియోజకవర్గాల పునర్విభజన జనాభా ఆధారంగా తీసుకుంటే చాలా రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా సీట్లు పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాలు ఈ నెల 22న అఖిలపక్షం ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి గెలిచిన కిషన్ రెడ్డి రాష్ట్రం పక్షాన నిలబడాలి. బీఆర్ఎస్, బీజేపీ మాటలను ప్రజలు నమొద్దు అని ఎంపీ చామల కోరారు. తెలంగాణకు నిధులు రాకుండా కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే నిధులను ఎందుకు కేటాయించడం లేదు..అని ఎంపీ చామల ప్రశ్నించారు.